అమరావతి, మార్చి 6: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బోళ్ళ సతీష్ బాబు నియమితులయ్యారు. రెండు రోజుల పాటు మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో జరిగిన ఐజెయు జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఐజెయు జాతీయ ప్రధాన కార్యదర్శి సబీనా ఇంద్రజిత్ ఈ మేరకు ప్రకటించారు. 1991లో ఉదయం దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి ప్రవేశించిన సతీష్ బాబు ఆ తరువాత ఆంధ్రప్రభ దినపత్రికలో 12 సంవత్సరాలు వివిధ హోదాల్లో పని చేశారు. 2003 నుండి గోదావరి దినపత్రిక సంపాదకునిగా పని చేస్తున్నారు. 2001లో ఐజెయు నేషనల్ కౌన్సిల్ సభ్యునిగా, 2003లో ఎపియుడబ్ల్యుజె తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా, 2019 నుండి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అనుబంధ సంఘం స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా సతీష్ బాబు పని చేశారు. ఐజెయు ఉపాధ్యక్షునిగా నియమితులైన సతీష్ బాబును ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్. వీరభద్రరావు, ఎపిఎంఎఫ్ నాయకులు బి. గిరిబాబు, వై. రాజేశ్వరరావు, అప్పాజీ తదితరులు అభినందించారు.
ఐజెయు జాతీయ ఉపాధ్యక్షునిగా సతీష్ బాబు