పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు
*వివిధ రకాల పర్యాటకాలను రూపొందిస్తాం
*వ్యవసాయ రంగం తరువాత రాష్ట్ర ద్వితీయ ఆదాయ శాఖగా పర్యాటక శాఖ
*పర్యాటక రంగంలో సీ ప్లేన్ లు
విశాఖపట్నం, మార్చి 5: స్టాక్ హోల్డర్ల సలహాలు సూచనలను అనుసరించి త్వరలో పర్యాటక రంగం నూతన పాలసీని రూపొందించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం రుషికొండ లో గల హరిత బీచ్ రిసార్ట్ లో నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ వర్క్ షాప్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగానికి అవసరమైన అపారమైన వనరులు ఉన్నాయన్నారు. వాటిని ప్రణాళికా యుతంగా అభివృద్ధి చేసి, ప్రచారం ద్వారా పర్యాటక రంగాన్ని మరింత విస్తృత పరిచేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈరోజు నిర్వహించిన వర్క్ షాప్ లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్టేక్ హోల్డర్స్ అద్భుతమైన అమూల్యమైన సలహాలు ఇచ్చారని చెప్పారు. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు వివిధ రంగాలను ఎంచుకున్నామని తెలిపారు. సముద్ర తీరం, అటవీ, పర్వత, చారిత్రాత్మక, దేవాలయ పుణ్యక్షేత్ర, నదీ ప్రాంతాలకు సంబంధించి పర్యాటక రంగాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి లో వ్యవసాయ రంగం తరువాత రెండవ స్థానంలో టూరిజం రంగంలో ఉండే విధంగా ఆదాయ వనరులను పెంపొందిస్తాయని అన్నారు. పెట్టుబడులకు పారదర్శకంగా 14 రోజులలో అనుమతిని మంజూరు చేసే విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ప్రకాశం బ్యారేజ్, నాగార్జునసాగర్ ప్రాంతాలలో సీ ప్లేన్ (నీటి పైన ఎగిరే విమానాలు) నడిపేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చారన్నారు. రాషూ నడిపే అన్ని బోట్లకు జాతీయస్థాయిలో శిక్షణ పొందిన డ్రైవర్లు, గైడ్లు ఉండేలా నిబంధనలు విధిస్తాం అన్నారు.
కరోనా పై భయం అపోహలు వద్దు
చైనా లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కరోనా వ్యాధి పట్ల ప్రజలు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని, అదేవిధంగా ఎలాంటి అపోహలను నమ్మవద్దని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నదని నగరంలోని కేజీహెచ్ ప్రతి ఆసుపత్రి జిల్లాలో అనకాపల్లి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా నిర్ధారణ, చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎవరూ భయాందోళనలకు తావివ్వొద్దని, పుకార్లను నమ్మవద్దని చెప్పారు. అందరం కలిసి అవగాహనతో ముందస్తు చర్యలు తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం పరిశుభ్రత పాటించాలన్నారు.