అమరావతి, మార్చి 6: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విజయవంతంగా జరిగాయి. 4వ తేదీ ఉదయం ఐజెయు జాతీయ అధ్యక్షులు గీతార్థ పాఠక్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశాలు 5వ తేదీ రాత్రి ముగిసాయి. ఐజెయు జాతీయ ప్రధాన కార్యదర్శి సబీనా ఇంద్రజిత్ పలు తీర్మానాలు ప్రవేశ పెట్టి సభ్యుల ఆమోదం పొందారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. ఐజెయులోను, ఐజెయుకు అనుబంధంగా పని చేస్తున్న వివిధ రాష్ట్రాల యూనియన్లలోను మహిళా జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సబీనా ఇంద్రజిత్ సూచించారు. ఐజెయు ప్రాతినిధ్యం లేని కొన్ని రాష్ట్రాల్లో స్థానిక యూనియన్లతో చర్చించి వారిని ఐజెయుకు అనుబంధంగా చేర్చుకోవాలని నిర్ణయించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాలని, మీడియాలో ప్రవేశిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జర్నలిస్టులు అందిపుచ్చుకునేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల్లో వర్క్ షాప్ లు, సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల ఐజెయులో తలెత్తిన సంస్థాగత సమస్యలపై విపులంగా చర్చించారు. ఐజెయు కేంద్ర కమిటీ పదవులలో ఉన్న ఖాళీలను ఈ సమావేశాలలో భర్తీ చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రతినిధి బోళ్ళ సతీష్ బాబును ఐజెయు జాతీయ ఉపాధ్యక్షునిగా నామినేట్ చేశారు. వివిధ రాష్ట్రాల యూనియన్ ప్రధాన కార్యదర్శులు తమ రాష్ట్రాల కార్యకలాపాలపై నివేదికలు సమర్పించారు. తదుపరి జాతీయ కార్యవర్గ సమావేశాలకు రాయపూర్ నగరంలో నిర్వహించేందుకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర జర్నలిస్టుల సంఘం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఐజెయు నేషనల్ కౌన్సిల్ సమావేశాలను ఈ ఏడాది డిసెంబర్ నెలలో విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఇటీవల జర్నలిస్టులపై జరిగిన పలు దాడుల సంఘటనలను ఆయన ప్రస్తావించి ఈ పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. మీడియా స్వేచ్చను హరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వస్తున్న కొన్ని జివోలు జర్నలిజం మనుగడకే సవాలుగా పరిణమిస్తున్నాయని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్న మీడియా, విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మీడియా, విపక్షాలు ఐక్య పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ఐజెయు 2019 కార్యక్రమాలతో ప్రచురించిన సావనీర్ ను, ఐజెయు వెబ్ సైట్ ను ఈ సందర్భంగా లోకేష్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి ఆధ్వర్యంలో ఐజెయు జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆతిధ్యమిచ్చారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్. వీరభద్రరావు సమన్వయకర్తగా రెండు రోజుల పాటు ఐజెయు జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి, ఇతర టీమ్ సభ్యులకు ఐజెయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గీతార్థ పాఠక్, సబీనా ఇంద్రజిత్ కృతజ్ఞతలు తెలిపారు.
విజయవంతంగా ఐజెయు జాతీయ కార్యవర్గ సమావేశాలు