ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు  కన్నుమూత


(హైదరాబాద్‌,నిజం న్యూస్): 
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందిన ఆయన ఈరోజు ఉదయం విజయ్‌నగర్‌ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరుజిల్లా పొత్తూరులో జన్మించిన పొత్తూరి వెంకటేశ్వరరావు... పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలందించారు.
1957లో ఆంధ్రజనతా పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన పొత్తూరి.. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో పనిచేశారు. సాహిత్యం, సాంస్కృతికం, రాజకీయం అంశాలపై అనేక రచనలు చేశారు. 2000 సంవత్సరంలో రచించిన ‘నాటి పత్రికల మేటి విలువలు’ పుస్తకం, 2001లో రచించిన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. పీవీ గురించి రాసిన ‘ఇయర్స్‌ ఆఫ్‌ పవర్‌’లో సహరచయితగా ఉన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, విధి నా సారధి, పారమార్థిక పదకోశం పుస్తకాలు రచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు.