సింహాచలం భూములపై వైసీపీ కన్ను... కాల్వ శ్రీనివాసులు 

సింహాచలం భూములపై వైసీపీ కన్ను... కాల్వ శ్రీనివాసులు 


అమరావతి: సింహాచలం భూములు కొట్టేయటానికి వైసీపీ కన్నేసిందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ధనదాహం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వేల కోట్లు స్వాహా చేయడానికే చైర్మన్ల మార్పు జరుగుతోందని విమర్శించారు. రాజకీయ కక్షతోనే ట్రస్ట్ బోర్డుల నుంచి అశోక్‌ గజపతిరాజును తొలగించారని అన్నారు. గజపతిరాజుల వంశంలో మగవారు మాత్రమే చైర్మన్‌గా ఉండాలని నిబంధన ఉందని, పీవీజీ రాజు తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌గా కొనసాగారని, ఆయన మరణం తర్వాతే అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మాన్‌సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా సంచిత నియామకం నిబంధనలకు విరుద్ధమని కళా వెంకట్రావు అన్నారు. రాజ కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టెలా వ్యవహరించారని విమర్శించారు. ట్రస్ట్ పరిధిలోని 13వేల ఎకరాలు కాజేసే కుట్రలో భాగంగానే ఇది జరిగిందన్నారు. లక్ష కోట్ల విలువైన భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ఓ పెద్ద తెరవెనుక ఇదంతా నడిపారనే ప్రచారం ఉందన్నారు. సింహాచలం భూములు కొట్టేయడానికే.. అశోక్ గజపతిరాజుని తొలగించి సంచితను నియమించారని కళా వెంకట్రావు ఆరోపించారు.