(విశాఖపట్నం, నిజం న్యూస్ )
గ్రేటర్ విశాఖ వార్ కి సమరశంఖం మోగింది.13ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జీవీఎంసీ ఎన్నికలు జరుగుతుండటం తో ఆశవహుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.
మేయర్ సీటును బిసి జనరల్ కు రిజర్వ్ చేశారు. నగరంలో 51 శాతం బిసి ఓటర్లు ఉండటంతో వారందరినీ తమ వైపు తిప్పుకునేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం ఆ వర్గానికి మేయర్ పదవిని కేటాయించిందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు వార్డుల రిజర్వేషన్ల ప్రకటన కూడా జరిగిపోవడంతో ఏ వార్డ్ ఎవరికి అన్నది తేలిపోయింది. రిజర్వేషన్ల జాబితాను తమ వద్ద పెట్టుకుని 98 వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో పార్టీలు తలమునకలు అయ్యాయి.వైసీపీ, టిడిపి, వామపక్షాలు,
బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో ఆయా పార్టీల ముఖ్య నేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆదివారం రాత్రే వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటనతో పాటు, ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఒక్కసారిగా అన్ని శిబిరాల్లోనూ సందడి నెలకొంది. ఒకవైపు ప్రచార హోరు, మరోవైపు టిక్కెట్ల కసరత్తు సాగుతుండటంతో మిని అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర నాయకులు మొదలుకుని కేంద్ర నాయకులు కూడా నగరంలోనే మోహరించి ఎన్నికల హోరును ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.గ్రేటర్ విశాఖ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా టీడీపీ కి నలుగురు, వైసీపీ కి నలుగురు ఎమ్మెల్యేలు వున్నారు. వైసీపీ కి అదనంగా ఇద్దరు ఎంపీలు. ఒక రాజ్యసభ సభ్యుల బలం ఉంది. వీరంతా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డ నున్నారు.
ఇదిలా ఉండగా అధికార వైసీపీ లో గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఫుల్ జోష్ నింపాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు ఇటీవల సీఎం జగన్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, నవరత్నాల హామీలు తొంభై శాతం అమలు చేయడం తో ప్రజలు తమ పార్టీ పట్ల పూర్తి సానుకూలంగా ఉంటారని భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లడం వారికి కలిసివచ్చే మరో అంశం. అదే సమయంలో సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్న ఘనతను కూడా పార్టీ తమ ఖాతాలో వేసుకొంది. విశాఖను పరిపాలనా రాజధాని గా ప్రకటించిన నేపధ్యంలో అది కూడా సానుకూల అంశం గా ఉంటుందని నమ్ముతున్నారు. మరోవైపు
విశాఖలో మూడు దపాలుగా మేయర్ సీటును టిడిపి గెలుపొందలేకపోయింది. ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. వార్డుల వారీగా ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేసుకుని నామినేషన్లు వేయించాలని భావిస్తోంది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు అభ్యర్థుల ఎంపికలో
తలమునకలయ్యారు. నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఏమ్మెల్సీ లు ఉండటం తమ అదనపు బలం అని టీడీపీ నమ్ముతోంది.
విశాఖలో సిపిఎం, సిపిఐ లకు క్యాడర్, కార్మికులు, ప్రజా సంఘాల బలముంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. సీపీఎం మాత్రం ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎవరితోనూ పొత్తులు, సర్దుబాట్లు లేవని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ప్రకటించారు. సీపీఐ మాత్రం టీడీపీ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.రాష్ట్రంలో అంతో ఇంతో బిజెపికి బలమున్నది విశాఖలోనే. ప్రస్తుతం జనసేనతో జట్టుకట్టిన బీజేపీ ఈ ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగనున్నాయి. ఇరు పార్టీల మధ్య ఇంకా పూర్తి స్థాయిలో సమన్వయం లేకపోవడంతో కొంత అయోమయం నెలకొంది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి మరణశయ్య పై ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.