(పెందుర్తి,నిజం న్యూస్ )
పేదలు ఇళ్ల స్థలాలివ్వాలని కోరుతూ పోరాటాలు సాగించిన సిపిఎం నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేయడం దుర్మార్గమని పార్టీ పెందుర్తి డివిజన్ కమిటీ సభ్యులు బి అనంతలక్ష్మి అన్నారు. సిఐటియు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడే సిపిఎం నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి బుధవారం అక్రమంగా అరెస్టు చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను అడిగితే, ఎప్పుడో కేసును సాకుగా చూపించారని వాపోయారు. తాము పేదల కోసం బహిరంగంగానే పాడుపడుతున్నామని, అక్రమల అరెస్టులు తమనేమీ చేయలేవని స్పష్టం చేశారు. వేల ఎకరాలు కబ్జా చేసిన వారిపై ఏ కేసులూ లేవని, తలదాచుకునేందుకు గుడిసెలు వేసుకున్న పేదల పైనా, వారికి అండగా నిలిచిన సిపిఎం నేతలపైనా కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, పోలీసు బలగాలతో గొంతునొక్కుతున్న పాలకులకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పివిఎస్‌ఎల్‌ఎన్ శాస్త్రి, సిఐటియు నాయకులు అప్పలరాజు పాల్గొన్నారు.
సిపిఎం నేతలపై తప్పుడు కేసులు దుర్మార్గం