ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీడీపీ కుట్ర ....చంద్రబాబుపై మంత్రి అవంతి ధ్వజం



(విశాఖపట్నం,నిజం బ్యూరో)
ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని  మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు.తనకు..తన కుమారుడు లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు లేదనే  ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దిలపాలెంలో పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. "చంద్రబాబు ఉత్తరాంధ్ర కు వచ్చి జగన్ లెక్కలు తేలుస్తామన్నారు. జనం ఆయన లెక్క తేల్చారు... జనం విశాఖలో రాజధాని కోరుకున్నారు.చంద్రబాబు  వద్దనే సరికి వారి కడుపు మండింది. తిరగబడ్డారు"అని అన్నారు.
పులివెందులనుంచి రౌడీలు వచ్చి తనను అడ్డుకున్నారని చెప్తున్నారు. మీ మీడియా వీడియోలు ఉన్నాయిగా? ఎవరు పులివెందుల వాసులో చూపండి. పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో చెప్పండి అని ప్రశ్నించారు.
‘పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. ఆయన నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. చంద్రబాబుకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించిందని.. పోలీసులపై చంద్రబాబు,లోకేష్‌ విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారని తెలిపారు. ఇళ్లకి వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్‌ అనడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అవంతి చెప్పారు.
విశాఖ పరిపాలన రాజధానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారో లేదో తేల్చి చెప్పాలన్నారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతికే మద్దతు తెలిపితే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ‘‘చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఆయనపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మండు టెండలో ఆరు గంటల పాటు ప్రజలు ధర్నా చేశారు. పోలీసులు, మహిళలపై చంద్రబాబు తీరు దారుణంగా ఉంది. లోకేష్‌ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని’’ అవంతి శ్రీనివాస్‌ తీవ్రంగా దుయ్యబట్టారు. మండలిలో ‘మూడు రాజధానుల బిల్లుల’ను టీడీపీ వ్యతిరేకించడంపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేశంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకున్నారని..కానీ ఇది ఉద్యమాలకు పుట్టినిల్లు అని అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలోగాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి , వైస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే మళ్లవిజయ ప్రసాద్,వైసీపీ నాయకులూ పీలా ఉమారాణి ,కొయ్య ప్రసాద రెడ్డి,రొంగలి జగన్నాధం,అక్కరమని విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.