గవర కులస్తుల ఆత్మీయ కలయిక, సామాజిక సంక్షేమ అభివృద్ధి లక్ష్యంతో రెండోవ ప్రపంచ గవర మహాసభలు శుక్రవారం ఉదయం కైలాసపురం పోర్టు కళావాణి స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గవర కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ అనకాపల్లి ఎమ్మెల్యే పిలా గోవిందా సత్యనారాయణ , గవర ప్రపంచం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఏ.వి. రమణ, లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీసెట్టి బాబ్జి, దేశ విదేశాల నుండి వచ్చిన ప్రపంచం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు గవర కుల ఇలవేల్పు అయిన గౌరీ పరమేశ్వరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రపంచ గవర సభను ప్రారంభించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన గవర కులస్తులను అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా గవర ప్రపంచం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. గవర కులస్తుల ఐక్యతను, సంఘీభావాన్ని తెలియజేసే విధంగా మొదటిసారిగా ఫిబ్రవరి 28 2016 లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో దేశవిదేశాలలో వివిధ రాష్ట్రాలలో జీవనం చేస్తున్న 70 వేల మంది గవర కమ్యూనిటీ ప్రజలతో ప్రపంచ గవర మహా సభను తొలిసారిగా నిర్వహించి విజయవంతం చేశామన్నారు. రెండోసారి ఈనెల 28న నిర్వహిస్తున్న గవర ప్రపంచ మహాసభలకు 5 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, చిత్తూరు జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒరిస్సా, జంషెడ్పూర్, ఖరగ్పూర్, అస్సాం, అండమాన్ మలేషియా, సింగపూర్, రంగూన్ తదితర ప్రాంతాల నుంచి మహాసభలకు ప్రతినిధులు తరలి వచ్చారన్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ప్రపంచ గవర మహాసభలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మహాసభలకు గవర పార్లమెంటు సభ్యురాలు బి.వి సత్యవతి, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు మల్ల విజయప్రసాద్, పీలా గోవింద్ శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ మహాసభలలో గవర కులస్తుల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం గత టిడిపి ప్రభుత్వం గవర కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందని, దీన్ని కొనసాగించడానికి ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు గవర కార్పొరేషన్ పాలకవర్గాన్ని కొత్తగా నియమించాలని కోరుతున్నట్లు డిమాండ్ చేశారు. గవర కులస్తులకు కళ్యాణ వేదిక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించివలసిందిగా అన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. గవర ప్రపంచం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏ వి రమణ మాట్లాడుతూ కుల, జాతి, మతం, వర్గాలకు అతీతంగా వితంతు వివాహం పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖ జిల్లాలోని పదవతరగతి పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్ పొందిన విద్యార్థులకు అత్యుత్తమ బోధన చేసిన ఉపాధ్యాయులకు ఈ మహాసభల్లో సత్కారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 35 మంది గవర పేద కుటుంబాల యువతుల వివాహానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం తో పాటు పావుతులం బంగారం తాళిబొట్లు, పట్టు చీరలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు కాలేజీ ఫీజులు, ఉచిత కోచింగులు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో చారిటబుల్ ట్రస్ట్ పర్మినెంటు ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు సరగడం వెంకట్రావు, డీకే సత్యనారాయణ, సన్యాసినాయుడు, వేగి అప్పారావు, పెంటకోట ముత్యాలనాయుడు, పి ఎస్ ఆర్ నాయుడు, వేగి పాపారావు, సరగడం వెంకట్రావు, దాడి రమణారావు, పి. కృష్ణ అప్పారావు, వేగి పరమేశ్వరరావు, శ్రీమతి ఏ వి సత్యవతి ట్రస్ట్ నెంబర్లు దేశ విదేశాల నుంచి వచ్చిన గవర నాయకులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.