పొత్తూరికి ఐజెయు నివాళి


అమరావతి, మార్చి 5: సీనియర్ పత్రికా సంపాదకులు,  ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) సంతాపం వ్యక్తం చేసింది. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఐజెయు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం  పొత్తూరి మరణ సమాచారం తెలియగానే ఆయన చిత్రపటానికి ఐజెయు ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జర్నలిజం రంగానికి పొత్తూరి వెంకటేశ్వరరావు చేసిన సేవలను ఐజెయు జాతీయ అధ్యక్షులు గీతార్థ పాఠక్, ప్రధాన కార్యదర్శి సబీనా ఇంద్రజిత్ ఈ సందర్భంగా స్మరించారు. తెలుగు పత్రికా రంగంలో తొలితరం ప్రతినిధి అయిన పొత్తూరి వెంకటేశ్వరరావు పాత తరం జర్నలిస్టులకు, ఆధునిక జర్నలిస్టులకు మధ్య వారధిలా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి వ్యాఖ్యానించారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్. వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి బోళ్ళ సతీష్ బాబు,  వివిధ రాష్ట్రాల జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.